Everyday is a festival day at Sri Chengalamma Parameshwari. On each specific day, the goddesses of goddess blesses her devotees in a specific ritual during the week days.Click here to read more.
శుభగరి గ్రామానికి పడమరగా ప్రవహించే కాళంగీ నది సమీపంలో పచ్చిక బయళ్లలో, పశువులను మేపుతారు. శుభగిరి గ్రామంలోని పశువుల
కాపర్లు ప్రతినిత్యం పశువుల మందలకు నదీ తీర ప్రాంతంలోని పచ్చికను కడుపార మేపి,నదిలో పశువులను శుభ్రంగా కడిగి, తాము కూడా నదిలో జలక్రీడ లాడి, సాయంసంద్య వేళకు పశువులను గ్రామంలోనికి తరలిస్తారు. ఒకనాడు అహ్లాదకరమైన సాయంసంద్యలో
పశువులన్నీ కడుపార పచ్చిక మేసి, కాళంగీ తీరంలోని ఇసుక తిన్నెలపై విశ్రాంతి తీసుకుంటున్నాయి. కాపర్లు నదిలో దూకి మునకలేస్తున్నారు. నీటిలో దాగుడు మూతలాడుతూ, కేరింతలు కొడుతున్న సమయంలో, ఒక యువకుడు మరకొడి నుండి తప్పుకోవడానికి నీటి అడుగుకి వెళ్లాడు, వయస్సు తెచ్చిపెట్టిన మొండి ధైర్యంతో మొండిగా ప్రవాహం అడుగున ఈదులాడుతున్న ఆ యువకుడు గిర్రున తిరుగుతున్న ఒక సుడిలోకి ఈడ్వబడ్డాడు.
కంటికి కనిపించనంత వేగంగా తిరుగుతున్న ఆ సుడి గుండం, ఆ యువకుడిని అలవోకగా తనలోనికి లాక్కున్నది. తనపని
అయిపోయిందని భావించిన ఆ యువకుడు చేతులు అడ్డంగా తిప్పి బారలు చాస్తూ ఆ సుడిగుండం నుండి బయట పడటానికి ప్రయత్నించాడు.
వదిలినట్టే వదిలిన ఆ ప్రవాహం, అంతలోనే అతడ్ని తలక్రిందులుగా లోపలికి లాక్కుంది. ప్రాణాలు మీద ఆశ వదిలేశాడు ఆ యువకుడు, ప్రవాహం ఎటు తిప్పితే అటు తిరుగుతూ నీటి అడుగుకు వెళ్లిపోయాడు. ఆఖరి
ప్రయత్నంగా భగవంతున్ని ప్రార్థిస్తూ కాళ్లు, చేతులు అడ్డంగా చాపి ఆధారం కోసం వెదుకుతుండగా ఏదో బండరాయి చేతికి తగిలింది.
సుడిలో చిక్కిన వాడికి నిలబడగలిగే ఆధారం దొరికితే, దాన్ని గట్టిగా పట్టుకొని సుడి వేగాన్ని తట్టుకోగలిగితే చాలు.. ప్రవాహం వేగం సుడిలో ఉన్న వాడిని బైటకు విసిరేస్తుందన్న సంగతి తెలిసిందే. ఆ యువకుడు, ఆ సుడి గుండంలో గిరికీలు కొడుతూ చేతికి తగిలిన బండరాయి కోసం వెదికాడు,
కొన్ని క్షణాల ప్రయత్నం తర్వాత ఆ యువకుడి శ్రమ ఫలించి ఆ బండరాయి అందుకున్నాడు. ప్రాణ భయంతో వణికిపోతున్న అతను, విపరీతమైన వేగంతో వున్న ప్రవాహం అతనితో పాటు అ బండరాయిని కూడా కదిలించి వేసింది. ప్రాణం వచ్చినట్లు ఆ రాయి ప్రవాహంలోంచి బైటకు విసిరి వేయబడింది. కన్నుమూసి తెరిచేలోగ
నిలువెత్తు వున్న ఆ బండరాయితో పాటు సుడి గుండంలోంచి బైట పడ్డాడు ఆ యువకుడు.
తన కోసం ఆత్రంగా వెదుకుతున్న సహచరులు కనిపించగానే తన ప్రాణాలు కాపాడిన బండరాయిని విడిచి వేగంగా ఈదుతూ గట్టు చేరుకున్నాడు. రెండు నిమిషాల పాటు అలసట తీర్చుకుని, తోటి కాపర్లతో జరిగిన సంగతి చెప్పి సుడి గుండంలోంచి బైట పడవేసిన బండరాయి వున్న చోటు
చూపించాడు.
ఈ సారి అందరూ కూడబలుక్కుని నీటిలోకి దిగారు.
జాగ్రత్తగా వెదుకుతూ ఆ యువకుడి ప్రాణాలు కాపాడిన నిలువెత్తు బండ రాయిని వెతికి పట్టుకొని, చేతుల మీద మోసుకుంటూ నది ఒడ్డున వున్న రావిచెట్టు క్రిందకు
చేర్చి పరుండ బెట్టారు. వారూహించినట్లు అది నిలువెత్తు బండరాయి కాదు, ఓ స్త్రీమూర్తి విగ్రహం.
సాయం సంద్యలోని సూర్య కిరణాలు వెలుగు ప్రసరించి నదీ గర్భం నుంచి వెలువడిన ఆ శిలా విగ్రహం వింత కాంతులు వెదజల్లుతోంది. అష్ట భుజాలతో వివిధ రకాలయిన ఆయుధాలను ధరించి, వామ పాదం క్రింద ఒక రాక్షసుడిని తొక్కిపట్టి, చేతిలో త్రిశూలంతో పొడిచి చంపుతున్న భంగిమలో వున్న ఆ స్త్రీమూర్తి విగ్రహాన్ని భయ భక్తులతో పరిశీలించి గ్రామంలోని
పెద్దలకు తెలియజేయాలనుకున్నారు వారు.
భానుడు అస్తమించాడు. నలువైపులా చీకట్లు క్రమ్ముతుండగా, పశువులు గ్రామం వైపు తరలాయి, శిలావిగ్రహం గురించి మాట్లాడుకుంటూ పశువుల కాపర్లు కూడా గ్రామం వైపు వెళ్లిపోయారు.
నదీ ప్రవాహంలో దొరికిన స్త్రీ మూర్తి విగ్రహం గురించి పశువుల కాపర్లు చెప్పగా విన్న గ్రామ పెద్దలు ఆ రాత్రి సమావేశమయ్యారు. వారు మూర్తిని దర్శించి, ఆ శిలా విగ్రహాన్నిగ్రామంలోనికి తెచ్చి గుడి కట్టి పూజించుకుందామని లేనియడల ఏదో ఒక అరిష్టం గ్రామాన్ని చుట్టు
ముట్ట వచ్చని భావించారు. తర్కవితర్కాలతో
వారు వారి వారి ఇండ్లకు వెళ్లిపోయారు.
క్షేత్ర స్వరూప క్షేత్రేశీ - క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ
క్షయ వృద్ది వినుర్ముక్తా క్షేత్రపాల తెల్లవారింది పరమేశ్వరి ఆవిర్భావమనే అంకానికి తెరలేచింది. బాలభానుడు తన నులి వెచ్చిన కిరణాలతో జగన్మాత చరణాలను అందుకుని అర్చిస్తున్న శుభవేళ ...
కొందరు రైతులు పశువుల కాపర్లుతో కలసి ముందు రోజు కాళంగీ నది ఒడ్డున విగ్రహన్ని వుంచిన రావి చెట్టు వద్దకు వచ్చారు. అంతే! వారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది. నిన్నటి రోజు సాయంత్రం తాము పరుండ బెట్టిన విగ్రహం లేచి నిలబడి వుండటం పశువుల కాపర్లకు భయందోళన కలిగించింది. అంతే కాకుండా ఆ పరిసర ప్రాంతమంతా ఆహ్లదకరంగా, సుగంధ పరిమళాలు వెద జల్లుతుండటం వారికి అశ్చర్యంతో పాటూ భక్తితో కూడిన పరవశం కలుగజేసింది.
తాము పరుండబెట్టిన విగ్రహన్ని ఎవరో లేపి నిలబెట్టి వుంటారని భావించారు పశువుల కాపర్లు. వారితో వచ్చిన గ్రామ పెద్దలు మాత్రం ఆ విగ్రహ శోభను చూసి ముగ్ధులయి, భక్తితో నమస్కరించారు. మహిషాసురమర్దిని అయిన ఆ స్వరూపాన్ని తమ గ్రామంలోకి తీసుకు వెళ్లి గ్రామ శక్తిగా గుడికట్టి పూజించుకోవాలని సంకల్పించి, ఆ విగ్రహన్ని అక్కడ నుండి తరలించేందుకు ప్రయత్నించారు.
నలుగురు పశువులకాపర్లు అవలీలగ మోసుకు వచ్చిన విగ్రహం పది మంది ద్రుఢకాయులైన రైతులు ఎంత ప్రయత్నించిన ఇసుమంతైన చలించలేదు. అందరూ కలసి తలో వైపు విగ్రహన్ని పట్టుకుని బలంగా లాగినా ఆ జగజ్జనని విగ్రహం వెంట్రుక వాసియైన కదలలేదు.. విసుగు చెందిన గ్రామస్థులు, గ్రామంలోనికి వెళ్లి మరుసటి రోజు కావలసిన పరికరాలతో వచ్చి, విగ్రహాన్ని పెకలించి బండిలో తీసుకువెళ్లాలని నిర్ణయించుకుని గ్రామంలోకి వెళ్లిపొయారు. వారి నిర్ణయం అలావుంటే ఆ తల్లి సంకల్పం వేరొక విధంగా వుంది.
ఆనాటి రాత్రి గ్రామ పెద్దలలో ఒకరైన రెడ్డి గారికి నిద్రలో ఓ స్త్రీ మూర్తి స్వప్న దర్శనమిచ్చింది.. "తాను నదీ తీరంలో వెలసియున్న దేవతని తనని అక్కడ్నుంచి కదిలించే ప్రయత్నం చెయవద్దనీ స్వయంభువైన తన మూర్తిని అక్కడే వుంచి పూజించుకొమ్మని" ఆజ్ఞాపించి అదృశ్యమైంది. మరుసటి రోజు ఉదయం ఆ రెడ్డిగారు తన స్వప్న వృత్తాంతాన్ని అందరికీ తెలియజేసి, సాటి వారితో కలసి విగ్రహం నెలకొని వున్న చోటుకి వచ్చాడు.
అక్కడ నదీ తీరంలో, మూర్తీభవించిన సౌందర్య రాశిలా దేదీప్యమానంగా షోడశ కళలతో వెలుగొందుతున్న జగన్మాత విగ్రహన్ని చూడగానే ఆ రెడ్డిగారికి గత రాత్రి తనకు దర్శనమిచ్చిన స్త్రీ మూర్తి జ్ఞప్తికి వచ్చి పులకించిపోయాడు. దేవీ ఆవిర్భావం గురించి, జగన్మాత లీలల గురించి తాను విన్న కధలన్నీ గుర్తుకు తెచ్చుకొని ఆనంద సాగరంలో ఓలలాడాడు. భక్తితో ఆ విగ్రహనికి సాష్టాంగ నమస్కారాలు అర్పించి, సాటివారితో "అయ్యలార, ఈ మూర్తి ఎవరోకాదు సాక్షాత్తు జగన్మాత మన పూర్వపుణ్యం వల్ల మన గ్రామంలో ప్రకటితమైంది. రాత్రి నాకు కలిగిన స్వప్నం ప్రకారం, ఆ స్వప్నంలో దేవి ఆజ్ఞానుసారం ఈ విగ్రహన్ని ఇక్కడే వుంచి పూజించుకుందాం" అనగానే అక్కడవున్న చెట్లను తీసి, శుభ్రపరచి తాత్కాలికంగా ఆ విగ్రహం చుట్టూ తడికలతో దడి కట్టి గుడిలా ఏర్పాటు చేశారు. అదే ఆ జగన్మాతకు ఏర్పడిన మొదటి ఆలయం. ఆ రోజు నుండి ఆ గ్రామంలోని రైతులు, పశువుల కాపర్లు నిత్యము ఆ తల్లిని దర్శించుకుని భక్తి శ్రద్దలతో వారి శక్త్యాను సారం పూజించుకునేవారు.
పవిత్రమైన కాళంగి నదిగా పురాణ ప్రసిద్దిచెంది, నేడు కాళంగీ నదిగా నామాంతరం చెందిన ఆ పుణ్య నదిలో సుడిగుండాలలో ఉయ్యలలూగుతూ పశువుల కాపర్లకు లభించి నది గట్టుకు విచ్చేసిన ఆ మూర్తి మహిషాసుర మర్దనీ రూపంలో వుండటంతో ఈ ప్రాంత వాసులు ఆ తల్లిని 'కాళికగా పిలుచుకుని కొలుచుకునేవారు. రావి చెట్టు క్రింద పరుండబెట్టిన విగ్రహం తనకు తానుగా దక్షిణాభి ముకంగా లేచి నిలబడటంతో " తెన్కాళీ " అని ఆ తల్లిని వ్యవహరించేవారు. తెన్కాళి అనగా " దక్షిణ కాళీ " అని తమిళ భాషలొ అర్థం ఆ " తెన్కలియమ్మే" నానాటికి చెంగాళమ్మగా నామాంతరం చెంది, నేడు సూళ్ళూరుపేటలొ శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిగా, భక్తుల ఆరాధ్య దేవతగా వెలుగొందుతొంది.
ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చోళరాజులు తమ వేగుల ద్వార కాళంగీ నదిలో ఆవిర్బవించిన పరమేశ్వరిని గురించి తెలుసుకుని,దర్శించి, పూజించి శ్రీ చెంగాలమ్మకు చిన్న గుడిని నిర్మించారు.
అష్ట భుజాలతో, షోడశకళలతో, అనిర్వచనీయమయిన సౌందర్య శోభతో, ఆకర్షనీయంగా వున్న ఈ దేవీ విగ్రహాన్ని తిలకించిన ఆనాటి చోళపండితులు, ఈ దేవత పార్వతీ దేవి మాత్రమే కాదని, మహాలక్ష్మి, మహా సరస్వతి, మహేశ్వరి అంశాలతో వెలిసిన పరాశక్తియని భావించారు. ఈ దేవి వామభాగం పార్వతీ అంశయని, దక్షిణ భాగం సరస్వతి అంశయని, వక్షస్థలం శ్రీ మహాలక్ష్మి అంశతో వెలసినదని స్పృష్టీకరించి, ఈ తల్లికి 'త్రికళ ' అని నామకరణం చేసినట్లు తెలుస్తుంది. త్రికళే చెంగాళిగా మారివుండవచ్చు. తమిళంలొ శెన్ కాళియమ్మ అనే అర్ధం కూడా ఉంది.
శ్రీ చెంగాళమ్మగుడిలో దొంగతనం చేసేందుకు ఒకడు ప్రయత్నించి భంగ పడ్డ సంగతి తెలిసిన గ్రామ పెద్దలు, తల్లి గుడికి తలుపులు బిగిస్తే రక్షణగా ఉంటుందని భావించారు. అందరికి అంగీకారంతో గర్భగుడికి ద్వార బంధము పెట్టి తలుపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించి, వడ్రంగులను పిలిచి పని అప్పగించారు.
కావలసిన కొయ్య సామాగ్రిని తెచ్చి వండ్రగులు పని ప్రారంభించారు. చూస్తుండగానే పని పూర్తి అయ్యింది. మరు దినం ఉదయం శుభ ముహూర్తం నిర్ణయించి ద్వారా బంధము పెట్టాలనుకొని, సిద్దం చేసిన కొయ్య సామాగ్రిని గుడి ప్రక్కనే వున్న చెట్టు మొదట్లో ఆనించి నిలబెట్టి ప్రొద్దు గ్రూకడంతో వారి ఇండ్లకు వెళ్లిపోయారు.
ఆ మరుసటి రోజే తల్లి గుడికి తలుపులు బిగించాలని గ్రామ పెద్దలు నిర్ణయించుకుంటే, దేవి సంకల్పం మరొక విధంగా వుంది. ఆ రోజు రాత్రి శ్రీ చెంగాళమ్మ తన గుడిని శ్రద్దాభక్తులతో సందర్శించి పూజించిన nbsp; ఒక భక్తురాలిని ఆవహించి ఇలా చెప్పింది. ఈ మార్గంలో నిరంతరం ప్రయాణించే భక్తులకు అన్ని వేళలా నా దర్శనం కాకుండా
నా గుడిని తలుపులతో మూస్తారా..? నన్నిలా నిర్భందించి, నా భక్తులకు ఆటంకం కలిగించకండి. ఇక రక్షణ అంటావా..లోకాలను రక్షించే నాకు రక్షణ అవసరం లేదు.. అని హెచ్చరించింది.
ఆ సంగతి తెలిసిన గ్రామస్థులు అమ్మవారి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుందని భావించి గ్రామస్థులతో కలిసి ఆలయం వద్దకు వచ్చారు. తలుపులు, ద్వారబంధం తయారు చేసిన వడ్రంగులు కూడా ఆ సమయానికి అక్కడకు చేరుకున్నారు. అందరు కలిసి క్రిందటి రోజు
సాయంత్రం తాము చెట్టు మొదట్లో నిలబెట్టిన కొయ్య పలకల వద్దకు వెళ్లారు. చిత్రంగా వారు నిలబెట్టిన పలకలన్నీ చెట్టు లో
విలీనమై చివురించివున్నాయి. మొదళ్లు
కోపులు, కోపులుగా చెట్టులో కలిసిపోయి ఉన్నాయి.
ఆ వింత చూసిన వారు సంబ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు. ఈ సంగతి తెలిసిన గ్రామస్థులు
పరుగు పరుగున ఆలయం వద్దకు చేరుకుని, ఆ తల్లి మహిమకు జేజేలు పలికారు. ఒక భక్తురాలికి పూనకం వచ్చిన వృత్తాంతము,
జరిగిన వింతను గురించి చర్చించుకుంటూ గర్భాలయంలోకి వెళ్లి ఆ తల్లికి సాష్టాంగ నమస్కారాలు చేశారు.
‘తల్లీ నీ మహిమను గుర్తించలేక, నీ గుడికి తలుపులు పెట్టి నిన్ను రక్షించాలని ప్రయత్నించిన మా మూర్ఖత్వాన్ని క్షమించు, లోక రక్షకివైన నీకు రక్షణ కల్పించాలనుకోవడం మా అమాయకత్వం. పెద్ద మనసుతో
మా తప్పులు మన్నించమని’ అని ప్రార్థించారు.
ఆ తల్లి సంకల్పాన్ని గుర్తించి శ్రీ చెంగాళమ్మ గుడికి తలుపులు పెట్టే ప్రయత్నం విరమించుకున్నారు పెద్దలు. ఇందుకు నిదర్శనంగా నేటికి శ్రీ చెంగాళమ్మ గుడికి తలుపులు లేవు. ఏ వేళైనా, ఎప్పుడైనా భక్తులు అమ్మవారిని నిరభ్యంతరంగా దర్శించుకోవచ్చు, పూజించుకోవచ్చు.
కొలచుకున్న వారి కలిమి, కోరిన వారికి కొంగున పైడి, శ్రీ చెంగాళ పరమేశ్వరీ, కొండంత కోరికైనా, కోరిన భక్తుల శ్రేయస్కరమైనది తప్పక ప్రసాదించే చల్లని తల్లి చెంగాళమ్మ అని భక్తుల నమ్మకం. ఆ నమ్మకం అక్షర సత్యమని నిరూపించే ఒకానొక లీల ‘నిమ్మపండు అభయం’
కొందరు భక్తులు ఎన్నో కోరికలతో ఆలయానికి వచ్చి, ఫల పుష్పాదులతో పాటు నిమ్మపండును కూడా తీసుకు వచ్చి, పూజారికి ఇచ్చి, తమ గోత్ర నామాలతో కుంకుమార్చన చేయిస్తారు. ఆ సమయంలో వీరు మనసులో తమ కోరికను తల్లికి తెలుపుకుని, ఆ కోరిక సమంజసమైనది, తీరునది, అయితే నిదర్శనం చూపమని దేవిని మనసారా ప్రార్థించి, నిమ్మపండును స్పృశించి, పూజారికి అందజేసి, తల్లి చేతిలో వుంచమని కోరుతారు.
వీరి కోరిక మేరకు నిమ్మపండును దేవి దక్షిణ అభయహస్తం పై వుంచుతాడు పూజారి. ఆ తర్వాత కుంకుమార్చన చేసిన గంట మ్రోగిస్తూ, కర్పూర నీరాజనాన్ని యిస్తాడు. ఆ సమయంలో అర్చన చేయించి భక్తుని మనసులో కోరిక నెరవేరుతుందనేందుకు నిదర్శనంగా దేవి చేతిలో నిమ్మ పండు విసిరి వేసినట్లు ఎగిరి భక్తుని ముందు పడుతుంది. ఆ సూచనతో ఆ భక్తులు తన మనసులో కోరిక ఆ చెంగాళమ్మ దయవలన నెరవేరుతుందని, దేవి అభయం లభించినది కనుక కార్యం శుభ్రప్రదమౌతుందని , సంతృప్తితో ఆ తల్లికి ప్రణామాలు చేస్తారు.
ఒక్కోసారి భక్తులు కోరుకున్న కోరికలకు ఆటంకాలు ఏర్పడి అవి నెరవేరనట్టయితే ఆశతో ఎదురు చూస్తూ, ఏకాగ్రతతో గంటల తరబడి నిలబడినా అమ్మ చేతిలోని నిమ్మపండు కదలకుండా వుండిపోతుంది. అలా కదలిక లేక క్రింద పడక నిశ్చలంగా ఉండటంతో భక్తులు, తమకు తల్లి అనుమతి లభించలేదని, తమ కోర్కెలు ఫలవంతం కావని భావిస్తారు. అలాంటి వారు పట్టు విడవకుండా ఎన్నిసార్లు వచ్చి తల్లిని అర్చించినా అభయ ప్రదానం జరగదు.
కొందరు భక్తుల కోరికలను నిమ్మపండు అమ్మవారి చేతి నుండి పూజారి అర్చన ప్రారంభించగానే ఎగిరి వచ్చి భక్తులు ముందు పడుతుంది. అలాంటి సమయాలలో భక్తులు సంతృప్తితో పొందే ఆనందం వర్ణనాతీతం. ఈ అభయ ప్రధానం కోసం నేటికీ అనేక మంది భక్తులు, చెంగాళమ్మ గుడికి వచ్చి ఏకాగ్రతతో దేవిని పూజించి తల్లి అనుగ్రహంతో నిమ్మపండు అభయాన్న పొంది సంతృప్తి పడుతుంటారు.
శ్రీ చెంగాళమ్మ తిరునాళ్లు అనగానే ఈ ప్రాంతంలో ఎంతో సంచలనం కలుగుతుంది. వారం రోజుల పాటు జరిగే సూళ్ళూరు పేట చెంగాళమ్మ తిరునాళ్ల వేడుకలు, అత్యంత వైభవంగా వేడుకగా జనాకర్షకంగా ఉంటాయి.
తిరునాళ్లు చేయాలని సంకల్పించినపుడు ఓ నలభై రోజుల ముందే నిర్ణయించుకుని, దర్మకర్త ఇంటి నుంచి మంగళ మేళాలతో, తప్పెట్లు, పంబజోళ్లవంటి వాద్యఘోషలతో గ్రామ పెద్దలు, లేక ధర్మ కర్తల మండలి ఊరేగింపుగా శ్రీ చెంగాళమ్మ గుడికి వెళ్తారు. అమ్మవారికి పూజలు జరిపి తిరునాళ్లు చేయడానికి అనుమతి అర్థిస్తారు. పూర్వపు రోజులలో గణాచారిపై దేవి ఆవహించి అనుమతి నిచ్చేది. కాని ఈ రోజుల్లో అమ్మవారు ఇచ్చే ‘నిమ్మపండు అభయం’ తోనే అనుమతి అభించినట్లు భావించి సన్నాహాలు చేస్తారు.
ఉత్సవాలకు శుభముహూర్తం నిర్ణయించి పదిహేను రోజుల ముందే ఒక శుక్రవారం అర్థరాత్రి గ్రామంలోని ప్రతి ‘గెమిడి’ (పొలిమేర) లో దిక్పాలురను ఆవాహన చేసి పసుపు కుంకుమలతో పూజ చేసి దిగ్భంధనం చేస్తారు. దీనినే ‘తొలిచాటు’ లేదా ‘మూగ చాటు’ అంటారు. దీనితో తిరునాళ్ల ఖాయమైనట్లు భావిస్తారు. పూర్వం రోజుల్లో అయితే తొటిచాటు నుండే గ్రామాన్ని అష్టదిగ్బంధం చేసేవారు. గ్రామస్థులు పక్క గ్రామాలకు వెళ్లినా సాయంత్రంలోగా ఇల్లు చేరుకోవాలి. బయట ఊరు వాళ్లు ఈ గ్రామంలోకి వస్తే ఉత్సవాలు పూర్తయ్యే దాకా వెళ్లనిచ్చేవారు కాదు ..!
ఇక వారం తర్వాత వచ్చే మరు శుక్రవారం నాడు రాత్రి, తాళాలు తప్పెట్లతో తిరునాళ్లు జరుగుతుందని మలి చాటింపు వేస్తారు. తిరునాళ్లు జరగబోతున్నాయని చాటించడమే చాటింపు అంటారు. దీనినే ‘మలి చాటింపు’ అంటారు. తర్వాత మూడవ శుక్రవారం నుండి తిరునాళ్లు మొదలవుతాయి. శుక్రవారం తెల్లవారు ఝామున బలిహరణ, సుడిమాను ప్రతిష్ఠ జరుగుతుంది.
సూళ్ళూరుపేట చెంగాళమ్మ తిరునాళ్లలో మొదటి మూడు రోజులూ, సాయంత్రం వేళలో జరిగే ‘సూళ్లు ఉత్సవం’ ప్రత్యేకంగా చెప్పకోదగినది. అమ్మవారి ఆలయానికి ఎదురుగా నలభై అడుగుల ఎత్తుగల లావుపాటి స్థంభాన్ని ప్రతిష్టిస్తారు. ఈ స్థంభానికి అగ్రభాగంలో నలువైపులా తిరిగేలా రాట్నం అమర్చి, ఆ రాట్నం మీద అడ్డంగా యాభై అడుగుల పొడవు ఉన్న మరో కొయ్యను త్రాసులా ఇరువైపులా సరిసమానంగా ఉండేలా బిగిస్తారు. ఈ అడ్డ స్థంభానికి ఒక వైపు పాలవెల్లి లాంటి చట్రాన్ని బిగించి, ఆ భాగాన్ని గాలిలోకి లేపుతారు, మరోవైపు నేల మీదకు దించి గుండ్రంగా తిప్పేటట్లు ఏర్పాటు చేస్తారు. దీనినే ‘సుడిమాను’ అంటారు. శ్రీ చెంగాళమ్మ తిరునాళ్లలో ప్రధానమైన ఈ సుడిమాను ఉత్సవాన్ని చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలి వస్తారు.
సుడిమాను పై భాగంలో వున్న చట్రానికి వరుసగా జీవంతో వున్న నల్లమేక పిల్లను, పసుపు బట్టతో బడిబాలను, రోలును, నిలువెత్తు మనిషి బొమ్మను, పూల మాలలను కట్టి తొమ్మిది ప్రదక్షణాలుగా సుడిమాను తిప్పుతారు. ఈ సుడిమాను తిరిగే సమయంలో, భక్తులు తాళాలు తప్పెట్లు భక్తి పారవశ్యంతో మోగిస్తారు. ఆ తప్పెట్లకు అనుగుణంగా గొల్లలు వీరతాళ్లతో కొట్టుకుంటూ, కిలారింపులు చేస్తూ, చిందులతో ఉత్సాహంగా సుడిమానుతో పాటు తిరుగుతారు.
పూర్వం రోజుల్లో సుడిమానుకు మొక్కుకున్న భక్తులే వ్రేలాడేవారు. మారిన కాలాంతో పాటు కొన్ని పద్దతులు మార్పులు చేసి మనిషికి బదులుగా మనిషి బొమ్మను కట్టి తిప్పుతున్నారు. ఈ సుడిమాను తిప్పడాన్నే కొన్ని పురాణాల్లో సిడి ఉత్సవం చేయడం అని పేర్కొనబడింది. ‘సిడి’ అనే మాటకు అర్థం ‘సిడుల జాతరకు నాటిన స్థంభం, మీద యడ్డమాను, ఇది గంప సిడి, గాలపు సిడి, అని ద్వివిధము’ అని శబ్దరత్నాకరం చెబుతుంది.
నేటికి చిత్తూరు గంగ జాతరలో కొందరు భక్తులు వీపులోనికి ఇనుప కొక్కేలను గుచ్చుకుని, ధృడమైన తాడుతో వాటిని బిగించుకుని, పెద్ద కొయ్యకు వ్రేలాడ దీసుకొని, ఎంతో ఎత్తు నుండి గంగమ్మకు హారతులిస్తారు. చిత్తూరు జిల్లాలోని సత్రవాడ గ్రామంలో (నగరి సమీపాన) కూడా కొందరు భక్తులు వీపులో ఇనుప కొక్కేలను దించుకొని పెద్ద కొయ్యకు వ్రేలాడుతారు. ఇలా ఇనుప కొక్కీలను శరీరాలకు గుచ్చుకొని వాటి ఆధారంగా గాలిలో వ్రేలాడటం వందల సంవత్సరాల నుంచి ఆచారంగా వున్నట్లు తెలుస్తుంది. 14వ శతాబ్దానికి చెందిన ‘క్రీడాభిరామం’ గ్రంధంలో మైలార వీర భటులను వర్ణించే పద్యంలో ‘గాలంపు కొంకికి కంకాళ చర్మాన్ని గుచ్చి నడి వీధుల్లో ఉయ్యాల లూగినట్లు ’ వర్ణించబడివున్నది.
అదే విధంగా తెనాలి రామకృష్ణ కవి ‘పాండురంగ మహత్యం’ లో కూడా ఈ సిడిమాను ప్రస్తావన కనిపిస్తుంది. అందులో ఒక స్త్రీ సిడిమాను నుండి వ్రేలాడినట్లు పేర్కొనబడింది. దీనిని బట్టి పూర్వం మహిళలు కూడా ఈ ‘జాతరలలో’ ఇనుప కొక్కీలను చర్మాన్ని కట్టుకుని సిడిమాను పై వ్రేలాడే వారని స్పష్టమవుతుంది.
సిడిని గురించి సురవరం ప్రతాపరెడ్డి గారు, ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ లో విపులంగా వివరించారు. ఆ కాలములోని ఆంధ్రుల వినోదాలలో ముఖ్యమైనవి ఇప్పుడంతరించి పోయినవి. అందు ముఖ్యమైనది సిడియాట, అది కేవలం వినోదమనుటకు లేదు. అది భక్తి ప్రధానముగా, ఆత్మ హింసాత్మకముగా చేయునట్టి ప్రదర్శన. భక్తులు మ్రొక్కుబళ్లు చెల్లించుకొనుటకై సిడిపై వ్రేలాడే వారు. ఇఫ్పుడు అవి లేవు అని వ్రాసారు. అయితే చిత్తూరు జిల్లాలోని జాతర్ల లో నేటికి ‘సిడి ప్రదర్శనలు’ వున్నయి.
విజయనగర చక్రవర్తుల కాలంలో భారతదేశంలో పర్యటించిన యూరోపు ఖండవాసి ‘బార్బోసా’ ఈ సిడిమాను, దానిపై వ్రేలాడే ఒక యువతిని చూసి ఇట్లు వ్రాసాడు
విజయనగర రాజ్యమందలి స్త్రీలు అతి సాహసికురాండ్రు, తమ మొక్కులు చెల్లించుకునుటకు భయంకరమైన పనులు చేతురు.
ఒక యువతి ఒక యువకుని ప్రేమించినచో, ఆమె తన మొక్కు చెల్లినచో సిడిపై వ్రేలాడబడేది. నిర్ణీతమైన ఒకరోజు మంగళ వాయిద్యాలతో బయలు దేరి సిడి స్థంభము వద్దకు చేరేది. సిడి స్తంభమునుకు వున్న ఇనుపకొండిని ఆమె చర్మం లోనికి గ్రుచ్చి సిడి పైకెత్తెదరు.
ఆమె గాలిలో కొండిపై వ్రేలాడినను, రక్తము కాళ్లపొడవునా కారి పోయినను, ఏ మాత్రం తాపం ప్రకటించదు. పైగా కూతలు పెట్టుచూ, కత్తి త్రిప్పుతూ, నిమ్మకాయలతో తన ప్రియున్ని కొట్టుచుండును. కొంత సేపటికి ఆమెను దింపి గాయమునకు కట్టు కట్టెదరు. ఆమె దేవళమునకు అందరితోపాటు నడచి వెళ్లి పూజలు చేసి, బ్రాహ్మణులకు దానాలు చేయును.
పై వివరాలను బట్టి చూస్తే ఈ సిడి లేదా సుడి ఉత్సవం ఈ నాటిది కాదని ఎంతో కాలంగా జరుగుతున్నదని తెలుస్తుంది.
శ్రీ చెంగాళమ్మ తిరునాళ్లలో ప్రతి రోజూ ప్రత్యేకతే, శనివారం జరిగే మహిషాసురమర్థనం మనం చూడలేకపొయినా, శ్రీ చెంగాళమ్మ తిరునాళ్లలో ఆనాటి వేడుకను కన్నుల విందుగా మనం దర్శించవచ్చు.
శనివారం రోజు రాత్రి వివిధ ఆయుధాలను ధరించిన శ్రీ చెంగాళమ్మ ఉత్సవ మూర్తి సింహ వాహనం మీద, గ్రామ శక్తి అంకమ్మ అశ్వవాహనం మీద గ్రామ పర్యటనకు బయలుదేరుతారు. అమ్మవారికి ముందుగా భయంకర రూపంలో వున్న మహిషాసురుడు గ్రామమంతా కలయదిరిగి, దేవాలయ సమీపంలో సింహ వాహనుడై శ్రీ చెంగాళమ్మకు ఎదురు పడేలా వస్తాడు. దాంతో సమరం ప్రారంభమవుతుంది.
శ్రీ చెంగాళమ్మ సింహ వాహనం ముందు ఆలయ ధర్మకర్త అమ్మవారి ప్రతినిధిగా రెండు మూరల కత్తితో మహిషాసురుని విగ్రహం తల తెగనరుకుతాడు.
మహిషుడు మొండెంతో వెనుకకు వెళ్లి మాయతో మరలా వేరే శిరస్సు ధరించి యుద్ధానికి వస్తాడు. ధర్మకర్త ఈ సారీ తల నరుకుతాడు, ఈ విధంగా తొమ్మిది సార్లు జరిగాక, మహిషాసురుడు తన నిజ రూపంతో దున్నపోతు తలతో దేవి ముందుకు వస్తాడు. ధర్మకర్త చేతిలో కరవాలం తళుక్కున మెరుస్తూ మహిషుని తలను ఎగర కొడుతుంది. దీనితో యుద్ద ఘట్టం పరి సమాప్తమవుతుంది.
ఈ మహిషాసురమర్ధనం వెనుక మరో నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యం కూడ వున్నది.
మనిషి ఆధ్యాత్మకంగా ముందుకు సాగడానికి దైవ కటాక్షం అవసరం. నిరంతరం మనపై వర్షిస్తూవుండే ఆ దైవం యొక్క ప్రేమను మనం గుర్తించకుండా మన లోపల వున్న కొన్ని నాస్తిక భావాలు అడ్డుపడుతూ వుంటాయి. ఆ దుష్టభావాలు ఒక్కొక్కసారి విపరీతమై దైవం యొక్క అస్థిత్వాన్నే శంకించే వరకు మన ఆలోచనలను తీసుకువెళ్తాయి. మన ఆధ్యాత్మిక పురోగమనానికి అడ్డంకి అవుతున్న ఈ ఆలొచనలే మూర్తీభవించిన మహిషాసురులు.
మహిషాసురిని ప్రతి రక్తం బొట్టులోను మరొక మహిషాసురుడు పుట్టి విజృంభించినట్లుగా! ఈ మహిషాసురతత్వాన్ని ఒక రూపంలో జయిస్తే అది మరో రూపంలో తలెత్తూతూనే వుంటుంది.
మనలోని త్రికరణములను ఏకంచేసి ఒక మహిషాసుర మర్ధని శక్తిగా రూపొందింప చేసుకుని వివేకము, విశ్వాసము, భక్తి అనే ఆయుధాలతో పోరాడినప్పుడే ఆ మహిషాసురమర్ధనం జరుగుతుంది. అది జరిగిన నాడే మనకు నిజమైన విజయ దశమి. ఈ అంతరార్థాన్ని తెలిపేదే సూళ్ళురుపేటలో జరిగే మహిషాసురమర్ధనం.
అప్పటి వరకు ఉత్కంఠతో యుద్దాన్ని గమనిస్తున్న భక్తజనులు హర్షధ్వనులు చేస్తారు. వెంటనే విజయ సూచకంగా బాణాసంచా వేడుకలు జరుగుతాయి. లక్షల రూపాయలు ఖర్చుతో జరిపే ఈ బాణాసంచా వేడుకలు అత్యంత వైభవంగా వర్ణింప లేనంత బ్రహ్మాండంగా, ఆకాశం దద్దరిల్లేలా జరుగుతాయి. ఈ యుద్ద వేడుకలను చూడటానికి జనం అనేక ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పాల్గొంటారు.
యుద్దానంతరం 'విజయ దుర్గ ' అయిన తల్లి గ్రామం లోకి వేంచేసి భక్తుల చేత మంగళహారతులు అందుకుంటుంది. ఈ గ్రామోత్సవం పూర్తయ్యేసరికి మరుసటి రోజు తెల్లవారిపోతుంది. ఆ తర్వాత రోజు ఆదివారం నాడు నంది వాహనం పై అమ్మవారు పుర వీధులలోకి వేంచేస్తారు. ఆ రోజుతో మూడు రోజులపాటు ప్రతి సాయంత్రం జరిగే సుళ్లు ఉత్సవం ముగుస్తుంది.
సోమవారం దేవి ఆవిర్భవించిన కాళంగీ నదిలో అమ్మవారి విజయోత్సవానికి చిహ్నంగా జరిగే తెప్పోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ తెప్పోత్సవానికి "వాటంబేడు" గ్రామానికి చెందిన మత్స్యకారులు రెండు నాటు పడవలు తెచ్చి, అలంకరించి అమ్మవారి సేవకు ఉపయోగిస్తారు. ఈ రోజు కూడ ప్రత్యేకమైన బాణాసంచా వేడుకలు జరుగుతాయి. శ్రీ చెంగాళమ్మ తిరునాళ్లలో సుళ్లు ఉత్సవం, మహిషాసుర మర్ధనం, తెప్పోత్సవములు అత్యంత ప్రధానమైనవి. ఈ ఉత్సవాలలో అనాదిగా జరిగే బాణసంచా వేడుకలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
మంగళవారం పుష్ప పల్లకిలో జగదీశ్వరి గ్రామ పర్యటనకు బయలుదేరి భక్తుల చేత మంగళ నీరజనాలు అందుకుంటుంది. బుధవారం మహిషాసుర మర్దని అయిన జగదంబకు విశ్రాంతి సేవగా ఆలయ ఆవరణలో శయన సేవ జరుగుతుంది. ఈ వేడుకలలొ అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా సంగీత విభావరి, హరికథాగానం, బ్యాండు మేళాలు, గరగ నృత్యాలు, కీలు గుఱ్ఱములు, బుట్ట బొమ్మలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
గురువారం సుడిమాను దింపుతారు. దీనితో తిరునాళ్ల వేడుకలు ముగుస్తాయి.
శుక్రవారం గ్రామంలోని అన్నివర్గాల వారు కులమతాలకు అతీతంగ మేళతాళాలతో వచ్చి ఆలయంలో అమ్మవారు ఎదుట పొంగళ్లు పెట్టుకుని, ఆ చల్లని తల్లిని సేవిస్తారు. దీనిని "చాటు పొంగళ్లు" అంటారు. ఆఖరు రోజు ఆలయ ధర్మకర్త పని బాపల వారందరిని యధోచితంగా సత్కరిస్తారు.
శ్రీ చెంగాళమ్మ తిరునాళ్లలో అమ్మవారిని భక్తులు పూజించే విధానాలు వైవిద్యంగా ఉంటాయి. ఈ పూజా విధానాలు మ్రొక్కుబడితో ఉండవచ్చు. మొక్కుబడిలేకున్నా సాంప్రదాయానుసారం, ఆచార్యవ్యవహారాలతో కూడుకుని వుండవచ్చు.
ఈ పూజా విధానాల్లో అడుగడుగు దండాలు, పొర్లు దండాలు, వేపచీరలు, కాళ్లు, పొట్టేళ్లువదలడం, పొంగళ్లు తళిగెలు, బలులు, అభిషేకాలు మొదలయినవి చెప్పుకోదగినవి.
పొర్లు దండాలు
చన్నీటితో అభ్యంగన స్నానం చేసి తడిబట్టల్తో పూజా సామాగ్రి, టెంకాయ వేపాకు చేతబట్టుకుని చెంగాళమ్మ గుడి చుట్టూ పొర్లుదండాలు పెడతారు భక్తులు. కోరుకున్న కోరికలు తీరినపుడు అమ్మవారిపై కృతజ్ఞతతో స్త్రీ, పురుషులు ఈ మ్రొక్కుతీర్చుకుంటారు. ఈ మ్రొక్కుబడిని ప్రతి శుక్రవారం, సంతానం కోరే స్త్రీలు ఎక్కువగా ఆచరిస్తుంటారు. సంతానం కలిగితే వేప చీరలు కట్టుకుని అమ్మవారిని దర్శించేవారు, కాని నేడు ఈ వేపచీరలు కనిపించడం లేదు.
వరపడటం
నేటికీ సంతాన హీనులయిన స్త్రీలు ఎంతో భక్తితో చెంగాళమ్మను సేవించి, సంతానాన్ని పొందిన దృష్టాంతాలు ఉన్నాయి. సంతానాభిలాషులైన స్త్రీలు అత్యంత నియమ నిష్టలతో, సూర్యోదయానికి పూర్వమే, శ్రీ చెంగాళమ్మ గుడికి వచ్చి, కాళంగీనదిలో తలస్నానం చేసి పసుపు చీర ధరించి తడిబట్టల్తో, పసుపు కుంకుమలు, పండ్లు, పూలు కొబ్బరి కాయలు మొదలగు పూజాద్రవ్యాలతో ‘ఒడిబాల’ కట్టుకుని అమ్మవారి సన్నిధిలో సాష్టాంగ నమస్కారముద్రలో పడుకుంటారు.
ఈ విధంగా పడుకోవడానికి స్థానిక భాషలో ‘పరపడటం’ అంటారు. తమ కోరిక తీరి గర్భం ధరించే వరకు కఠోర దీక్షతో కొన్ని వారాలపాటు ఈ వ్రతాన్ని కొనసాగిస్తారు. వారి వ్రతం ఫలించి ఆ తల్లి అనుగ్రహంతో జన్మించిన బిడ్డలకు శ్రీ చెంగాళమ్మ పేరు పెట్టుకుంటారు. అందుకే ఈ ప్రాంతంలో ‘చెంగారెడ్డి, చెంగయ్య, చెంగమ్మ, చెంగాళమ్మ,చెంగల్రాయలు’ వంటి పేరు ఎక్కువగా వినిపిస్తుంటాయి. పై దృష్టాంతరములను బట్టి శ్రీ చెంగాళమ్మ సాక్షాత్తు సంతాన లక్ష్మియని మనం విశ్వస్తాం.
మొక్కుబడులు
కొందరు భక్తులు తాము అనుకున్నవి జరిగితే వాళ్ల శక్తిని బట్టి అమ్మవారికి పూజలు నిర్వహిస్తామని మ్రొక్కుకుంటారు. ఈ మ్రొక్కుల్లో అర్చన, అభిషేకాలు చేయించడం పొంగళ్లతో నైవేద్యం పెట్టడం వంటివి కొందరు భక్తులు చేస్తే. మరికొందరు జంతుబలి ఇవ్వడం ద్వారా మొక్కులు తీర్చుకుంటారు. శ్రీ చెంగాళమ్మ ఆలయంలో జంతుబలి నిషేదించబడినా కొందరు భక్తులు చాటుగానైనా ఈ జంతుబలిని ఇస్తూనే ఉన్నారు. ఇది అనాధిగా వస్తున్న మూఢాచారం జంతువుల్ని బలి ఇవ్వడాన్ని చట్టం ఎంతగా వ్యతిరేకిస్తున్న కొందరు ఈ మూఢాచారాన్నిఇంకా పాటిస్తున్నారు.
బలులు ఇచ్చే మనస్థత్వం మానవునికి ‘ఆత్మారాధన’ దశ నుండే ప్రారంభమైంది. చనిపోయిన వారి ఆత్మలకు కూడా బ్రతికి వున్న వారికున్నట్లే అవసరాలు ఉంటాయని, అవి తీరకపోతే ఆ ఆత్మలు ఆగ్రహించి తమకు కీడు చేస్తాయని, ఆనాటి మానవుడు భావించే వారు. అందుకే వారు దేవతలను జంతుబలుల తో, మద్యాన్ని నైవేద్యంగా సమర్పించడంతో పూజించే వారు.
పూర్వం శ్రీశైలంలో శివసాయుజ్యం కోసం ‘కొండకొమ్ము’ పై నుండి దూకి భక్తులు అత్మార్పణ చేసుకునే వారు. ఈ అత్మార్పణవల్ల మోక్షాన్ని పొందుతామని ప్రాచీణ మానవుని నమ్మకం. ఆ తర్వాత మరొకరిని బలి ఇవ్వడం మొదలైంది మరికొంత కాలానికి మనిషికి బదులుగా జంతువులను బలి ఇవ్వడం ప్రారంభించారు. హైందవ మతంలోని నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన ‘ఆత్మనివేదన’ కు పెడార్థం తీసి ఈ అమానుషకార్యాన్ని నేటికి చేస్తున్నారు. ఆత్మనివేదనుకు అసలైన అర్థం దైవానికి సర్వస్య శరణాగతి చెంది మనసావాచా, కర్మణా ఆ దైవాన్ని ఆరాధించడమే కాని మరొక జీవిని బలి ఇవ్వడమో లేక తనను తాను బలిచేసుకోవడమో కాదు. సకల చరాచరసృష్టికి తల్లి అయిన ఆ జగజ్జననికి అన్న జీవివులపై సమానమైన ప్రేమ, కరుణ వుంటుంది. అటువంటప్పుడు మరొకి జీవిని తనపేరు మీద బలి ఇవ్వడాన్న ఎలా సహిస్తుంది..? బలి అయిపోతూ ఆ జీవిచేసే ఆర్తనాదం ఆ తల్లికి ఆనందం కలిగిస్తుందని భావించడం ఎంత మూర్ఖత్వం ? కనుక విజ్ఞలైన భక్తులు ఈ మూఢాచారాన్ని మానివేసినపుడు ఆ తల్లికి నిజమైన ఆనందాన్ని కలిగించిన వారవుతారు. కనుక భక్తులందరూ తమ పరిధిలోనైనా ఈ జంతుబలిని ఆపేందుకు కృషి చేయాలి.
అభిషేకాలు – అర్చనలు
పూర్వ కాలంలో శ్రీ చెంగాళమ్మకు ప్రత్యేక పూజలంటూ వున్నట్లు దాఖలాలు లేవు. గ్రామ దేవతలను పూజించే విధంగానే శ్రీ చెంగాళమ్మను పూజించే వారు. సాధారణంగా గ్రామదేవతలకు అర్చనలు అభిషేకాలంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఆనాటి రోజుల్లో పూజారులు అభిషేకం చేసినా, అది విగ్రహాన్ని మంచి నీళ్లతో కడిగి, పసుపుపూసి, కుంకుమ బొట్టు పెట్టడం, కొబ్బరికాయ కొట్టి కర్పూర హారతి ఇవ్వడం వరకు ఉండేది.
ఆ తర్వాత కాలంతో పాటు అమ్మవారి పూజా విధానాలు కూడా మారాయి. 1983 నుండి గ్రామదేవతాపూజా విధానంలో శిష్ట దేవతా పూజా విధానాలు నేరుగా చోటు చేసుకున్నాయి. అప్పటి ఆలయ ధర్మకర్తల కృషి, వారికి అమ్మవారిపై వున్న అవగాహన, భక్తి వల్ల స్మార్త ఆగమ పూజా విధానాన్ని కట్టుదిట్టంగా అమలు పరిచారు. ఆ విధానం ప్రకారం ఇప్పటికి పూజలు చేస్తున్నారు. శ్రీ చెంగాళమ్మ కోవెల ఇరవైనాలుగు గంటలూ తెరచి వుంచడం వల్ల సుప్రభాతం, ఏకాంత సేవ వంటివి జరగడం లేదు.
సూళ్లూరు పేట శ్రీ చెంగాళమ్మ అనాధికాలం నుండి, గ్రామంలో ని ‘బలిజ’ కులానికి చెందిన వారు పూజలు చేస్తున్నారు. వీరు వంశపారం పర్యంగా చెంగాళమ్మకు పూజాదికాలు నిర్వహించే వారు కనుకనే ఆలయం నేడు ‘ఎండో మెంటు’ వారి పాలనలోకి వచ్చి ఎండోమెంటు వారి బ్రహ్మణ పూజారులైన శ్రీ ముళ్లపూడి హరిహరశర్మ, శ్రీ కప్పెర లక్ష్మణకుమార్ తో కలిసి వీరు కూడా అర్చకత్వం నిర్వహిస్తున్నారు. శక్తి ఆలయాల్లో పూజలు సాధారణంగా బ్రాహ్మణులు చేయరు. వైదిక మతానికి పూర్వమతమైన శక్తేయమతాన్న అనుసరించి శాక్తేయులు అయిన శూద్రలే శక్తి ఆలయాల్లో పూజలు నిర్వహించేవారు. ఆ ఆచారం ప్రకారమే శ్రీ చెంగాళమ్మ గుడిలో ‘కీసరపల్లి ఆదినారాయణశెట్టి, సనిశెట్టి చెంచునారాయణ శెట్టి, గున్నయ్యశెట్టి, చెంగయ్య శెట్టి, పాపయ్య శెట్టి, మొదలగువారు అమ్మవారి పై భక్తి తత్పరతతో, నిస్వార్థంగా సేవచేస్తున్నారు. ఇప్పటికీ వీరు వీరి వారసులు అమ్మవారి సేవలో ఉన్నారు .
అమృత తుల్యం అమ్మవారి నైవేద్యం
ఈ సృష్టిలో మనం తినే ప్రతీ వస్తువు దైవం మన కొరకు సృష్టించింది. అందుకే మనం ఏ పదార్థన్నైనా స్వీకరించే ముందు దైవానికి అర్పించిన తర్వాత ప్రసాదంగా గ్రహించాలి. (న+వేద్యం, ఒక వస్తువు యొక్క రుచి లేదా దాని అనుభవసారమైన జ్ఞాపకం లేకపోవడమే నైవేద్యం) దైవం మీద భక్తి శ్రద్దలతో వండి అర్పించిన పదాదర్థం అమృతతుల్యం అవుతుంది. దాన్ని ప్రసాదంగా భుజించే భక్తులకు అమృతత్వాన్ని కలిగిస్తుంది. దైవానికి నైవేద్యం సమర్పించే సమయంలో
‘అమృతమస్తు ! అమృతోపస్మరణమితి స్వాహాఠం
అమృతాత్మనే అమృతతన్మాత్రా ప్రకృత్సానందాత్మనే
అమృతాత్మకం నైవేద్యం సమర్పయామి’’
అనే మంత్రోచ్చారణ చేయడంలో పరమార్థం ఇదే.
దైవ ప్రసాదాన్ని ఒక్కరేగాని కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే గాని భుజించకూడదు. సాటి భక్తులకు ఇరుగు పొరుగు వారికి పెట్టిన తర్వాత భుజించాలి.
పంచమ వేదమైన మహాభారతం ‘ప్రేక్షతామప్రదాయ సభుంజీత’ ‘ప్రక్కవాడికి పెట్టకుండా తినకూడదు’ అని చెబుతుంది.
ప్రసాదమే కాదు..మనం ఏం తిన్నా త్రాగినా దాన్ని దైవ ప్రసాదంగానే భావించాలి. తినబోయేముందు మనస్ఫూర్తిగా శ్రీ చెంగాళమ్మను తలచుకొని, ఆ తల్లికి నివేదించిన తర్వాత పక్కవారికి పెట్టి తాము భుజించాలి. ఆ పక్కన వున్న వారు మనిషే కానవసరం లేదు, ఏ ప్రాణిని పిలవనవసరం లేదు. దగ్గరికి వచ్చిన ఏ ప్రాణైనా మనకు అతిథే.
పూనకాలు
శ్రీ చెంగాళమ్మ గుడివద్ద ఈ పూనకాలను మనం చూడవచ్చు పూర్వపురోజుల్లో గణాచారిపైకి అమ్మవారు ఆవహించేవారని, ఆ గణాచారి పూనకంతో ఊగిపోతూ కొన్న తరుణోపాయాలు చెప్పేవాడని అంటారు. అయితే పూనకాలు ఎక్కువగా స్త్రీలకే వస్తుంటాయి. చెంగాళమ్మ శక్తి స్వరూపిణి కనుక స్త్రీల పైనే ఎక్కువగా ఆవహిస్తుందని పెద్దలు చెబుతుంటారు. కానీ స్త్రీలకు పూనకాలు అధికంగా రావడానికి ‘హిస్టీరియా’ కారణమని, హిస్టీరియా స్త్రీలలో అధికమని మనస్థత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తిరునాళ్లలో భక్తుల ఆచార వ్యవహారాలు
ప్రతి ఏడు అమ్మవారి నవరాత్రలు ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ప్రత్యేకించి శ్రీ చెంగళమ్మ తిరునాళ్లు అయిదేళ్లకు గాని ఏడేళ్లకు గాని ఒకసారి జరగడం వల్ల, ఈ పరిసర ప్రాంతవాసులు ఎప్పుడెప్పడా అని ఎదురు చూస్తుంటారు. తిరునాళ్లు చాటింపువేయగానే దగ్గర బంధువుల్ని దుర ప్రాంతాల్లోని బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తారు. విందులు, వినోదాలతో అందరూ కలిసి మెలసి గడపటానికి చెంగాళమ్మ తిరునాళ్లు ఒక చక్కని సందర్భాంగా అందరూ భావిస్తారు.
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి, ఆదిశక్తి అవతారమా లేక గ్రామదేవతా అనే సందేహం ఈనాటికీ ఉంది. దక్ష్యయజ్ఞ సమయంలో అవమానంతో తనువు చాలించిన సతీ దేవి అంశతో వెలసిన తల్లియని , ఇక్కడ పురాతనమైన శివాలయము వుండటంవలన ఈ తల్లిని పార్వతీదేవియని పెద్దలు చెబుతున్నారు. సాధారణంగా గ్రామ దేవతల విగ్రహాలు కేవలం రాయి రూపంలోనో, లేక శిరస్సు మాత్రమే కనిపించే విధంగానూ ఉంటాయి. ఉదాహరణకు ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతిలో గ్రామదేవతైన గంగమ్మ విగ్రహం కూడా శిరస్సుతోనే ఉండటం మనం చూదవచ్చు. కాని శ్రీ చెంగాళమ్మ 'మహిషాసురమర్ధని 'అయిన మనం భావించవచ్చు.
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి, ఆదిశక్తి అవతారమా లేక గ్రామదేవతా అనే సందేహం ఈనాటికీ ఉంది. దక్షయజ్ఞ సమయంలో అవమానంతో తనువు చాలించిన సతీ దేవి అంశతో వెలసిన తల్లియని , ఇక్కడ పురాతనమైన శివాలయము వుండటంవలన ఈ తల్లిని పార్వతీదేవియని పెద్దలు చెబుతున్నారు. సాధారణంగా గ్రామ దేవతల విగ్రహాలు కేవలం రాయి రూపంలోనో లేక శిరస్సు మాత్రమే కనిపించే విధంగానూ ఉంటాయి. ఉదాహరణకు ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతిలో గ్రామదేవతైన గంగమ్మ విగ్రహం కూడా శిరస్సుతోనే ఉండటం మనం చూడవచ్చు. కాని శ్రీ చెంగాళమ్మ 'మహిషాసురమర్ధని 'అయిన మనం భావించవచ్చు.
సుమారు అయిదు అడుగులు ఎత్తున్న ఈ మూర్తిలో జీవకళ అనువనువూ స్పష్టంగా కనిపిస్తుంది. ఇంద్రకీలాద్రి పర్వతం పై వెలసియున్న (విజయవాడ) కనకదుర్గమ్మవలే, ఈ తల్లికీ నవరాత్రులలో ఉత్సవాలు నిర్వహించడం అమ్మవారికి జరిగే తిరునాళ్లను 'జాతర ' అని వ్యవహరించక పొవడం, ఉత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించడం వంటివి ఈ తల్లి ఆది పరాశక్తియని తెలియజేస్తున్నాయి. అంతే కాకుండా సూళ్ళూరుపేట పంచాయితీలోని మన్నరుపోలూరులో ఒక చెంగాళమ్మ గుడి ఉన్నది. శ్రీ చెంగాళమ్మ భక్తులు సమీపంలో వున్న ఈ ఆలయాన్ని దర్శించడం శ్రేయస్కరం. పురాతనమైన ఈ కోవెలలో స్వయంభువైన అమ్మవారి శిలను దర్శించవచ్చు. కాళంగి తీరాన వున్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానానికి కూడా ఉన్నది. కోళ్లమిట్టలో ఒక రావిచెట్టును చెంగాళమ్మ చెట్టుగా భావించి పూజించడం జరుగుతుంది. శ్రీ చెంగాళమ్మ గ్రామదేవత అయితే ఇన్ని చోట్ల ఒకే పేరుతో పూజించడం సాధారణంగా జరుగదు. అయితే తిరుపతి గ్రామదేవత అయిన గంగమ్మకు రెండు గుడులు ఉన్నా తిరుపతి ఆర్.టి.సి. బస్టాండుకు ఉత్తర దిక్కున వున్న గంగమ్మను తాతాయి గుంట చిన్నగంగమ్మ అని,ఆర్.టి.సి. బస్ స్టాండుకు దక్షిణ దిశగా నాలుగు రోడ్ల కూడలిలో వున్న గంగమ్మను తాళ్లపాక పెద్ద గంగమ్మ అని వ్యవహరించి పూజిస్తున్నారు. వీరిద్దరినీ తిరుపతి వాసులు అక్కాచెల్లెలుగా భావిస్తారు. అదేవిధంగా మన్నారు పోలూరులో వున్న శ్రీ చెంగాళమ్మ, సూళ్ళూరుపేటలో వున్న శ్రీ చెంగాళమ్మ అక్కా చెల్లెల్లని పెద్దలు చెబుతుంటారు.
సూళ్ళూరుపేటలో వున్న పురాతన శివాలయం ఉండటం వలన ఇక్కడ లభించిన వీరభద్రస్వామి విగ్రహం వలన, అమ్మవారి విగ్రహం వున్న తీరు వలన , అమ్మవారి విగ్రహం వున్న తీరు వలన, ఈ తల్లి ఆది పరాశక్తి అవతారమని విశ్వసించవచ్చు. సూళ్ళూరుపేట గ్రామ దేవత శ్రీ అంకమ్మతల్లి అని పెద్దలు చెబుతారు, ఉత్సవాలలో చెంగాళమ్మతోపాటు శ్రీ అంకమ్మ ఉత్సవ విగ్రహాన్ని కూడ ఊరేగించడం ఈ భావనకు కొంత ఆధారం . దీనిని బట్టి సూళ్ళురుపేట గ్రామదేవత శ్రీ అంకమ్మ అని నిస్సందేహంగా భావించవచ్చు.
అంతే కాకుండా సుమారు ముప్పై సంవత్సరాల క్రితం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు, శ్రీ చంద్రశేఖర సరస్వతీస్వామి వారు, మరియు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు సూళ్ళూరుపేట శ్రీ చెంగాళమ్మ గుడిని దర్శించారు. వారు ఆలయాన్ని అమ్మవారి మూల విగ్రహాన్ని నిశితంగా అణువణువూ పరిశీలించి ఈ దేవత గ్రామశక్తి కాదని, 'అర్దనారీశ్వరీ' అవతారమని అభిప్రాయపడ్డారు.
ప్రముఖ యోగీంద్రులు శ్రీ సుధీంద్రబాబు గారు ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారిని మహిమగల దేవతగా కొనియాడినట్లు, సాయిమాస్టార్ గా భక్తులచే పూజించబడుతున్న ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు అమ్మవారిని దర్శించి ఆమె సన్నిదిలో ధ్యానం చేసుకున్నారని, "ఎందరో సిద్దపురుషుల తపశ్శక్తి ఇక్కడ నిబిడీక్రుతమైయున్నదని’’ చెప్పినట్లు మాస్టర్ గారి శివ శ్రీ అల్లు భాస్కర్ రెడ్డి గారు చెప్పారు.
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని ముఖ ద్వారం నుండి పరిశీలిస్తే త్రికోణాలుగా ఉంది మద్య బిందువుగా వున్న అమ్మవారి విగ్రహం , గర్భాలయం, ముఖమండపం, అన్నీ కలసి "శ్రీ చక్ర" రూపంలో కనిపిస్తాయి .ఈ మాట అక్షర సత్యమని దేవీ ఉపాసకులు ఎందరొ చెప్పారు.
అమ్మవారి ఆవిర్భావము , పూజావిధులు పురాతన కాలం నాటి విశేషాలు , ఈ తల్లి పరమేశ్వరీ అవతారమని స్పష్టం చేస్తున్నాయి. ఎవరు ఎన్ని విధాలుగా భావించినా, ఏ విధంగా పూజించినా నమ్మిన వారిని చల్లగా కాచే జగదీశ్వరి శ్రీ చెంగాళమ్మ.
"బిందు త్రికోణవసుకోణ దశార యుగ్మ
మన్వస్రనాగదళ షొడశ పత్రయుక్తమ్
వృత్తత్రయం చ ధరణే సదనత్రయం చ
శ్రీ చక్రరాజ ఉదితః పరదేవతాయః "
సూళ్ళూరుపేటకు కన్నతల్లిగా ఈ ప్రాంతీయులందరికీ ఇలవేలుపుగా వెలసియున్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయ ప్రాంగణం సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉంది. తూర్పున నెర్రికాలువ పడమర కాళంగీ నది ఈ కోవెల ప్రాంగణాన్ని తాకుతూ ప్రవహిస్తున్నాయి.
జాతీయ రహదారిలో శ్రీ చెంగాళమ్మ గుడి వద్దకు రాగానే విజయ ద్వారం స్వాగతం పలుకుతుంది. ఈ విజయద్వారాన్ని దాటగానే ఉత్తర దిక్కున కోవెలలోని గర్భగుడిలో దేదీప్యమానంగా వెలుగుతున్న అమ్మవారు దివ్య దర్శనం కలుగుతుంది. ఆలయంలోనికి ప్రవేశించకుండానే గర్భగుడిలోని అమ్మవారి దర్శనం కలిగేలా నిర్మించిన ఆలయం దేశంలోనే బహుశా ఇదొక్కటేనేమో..!
దక్షిణాభిముఖంగా ఉన్న అమ్మవారి ఆలయ గోపుర మండపాన్ని దాటగానే అద్భుతమైన కళానైణ్యంతో నిర్మించిన ద్వార బంధం కనువిందు చేస్తుంది. ముఖ మండపంలోకి అడుగుపెట్టగానే మన చింతలను ఆలోచనలను మరిచి ఒక విధమైన తాదాత్మ్యంలోకి వెళ్లిపోతాము. ఎడమ పార్శంలో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం వున్నాయి. ప్రదక్షిణను పూర్తి చేసుకొని అమ్మ వారి ముందుకు వచ్చి స్నపన మండపంలోనికి ప్రవేశించవచ్చు.
ఆ గర్భగుడిలో వింత కాంతులు వెదజల్లే దీపాల వెలుగులో చిరు నవ్వులు చిందుస్తున్న అమ్మవారి విగ్రహాన్ని చూడగానే మనం పొందే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. రోజుకొక అలంకరణతో బంగారు కిరీటాన్ని దాల్చి శూలాన్ని ధరించి ఉన్న తల్లిని నిలువెల్లా కళ్లు చేసుకొని తిలకిస్తాం. అష్టబుజాలతో షోడశకళలతో, ఆయుధాలను ధరించి వామ పాదంతో మహిషాసురడ్ని త్రిశూలంతో పొడిచి చంపుతున్న ఆ జగదీశ్వరిని దర్శించగానే తనువు రోమాంచితమవుతుంది. హృదయం మృదంగ ధ్వని చేస్తూ ఆ తల్లిని కీర్తిస్తుంది.
‘అయినిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధుమ్రశిఖే
సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాధిక బీజలతే
శివశివ శుంభ నిశుంభ మహాహవ దర్పిత ధూత పిశాచపతే
జయజయహే మహిషాసుర మర్ధిని రమ్యక పర్థిని శైలసుతే’
అని స్మరిస్తుంది, మహిషాసురమర్ధినియై, భీకర స్వరూపాన్ని దాల్చిన ఆ మూర్తి అంతలోనే కన్నతల్లిగా గోచరించి చిరునవ్వులు చిందుస్తుంది. తీక్షణంగా చూసే కనుచూపుల్లో కరుణ జాలువారతుంది. దుష్టసంహారిణి అయిన ఈ దుర్గాభవాని, సంతానార్ధులకు సంతానలక్ష్మిలా కనిపిస్తుంది. భయార్తులకు ధైర్యలక్ష్మిగా గోచరించి ఆత్మ స్థైర్యాన్ని నింపుతుంది. ముత్తైదువులకు పసుపు, కుంకులొసగే సౌభాగ్యలక్ష్మిలా ఆశీర్వదిస్తుంది. కర్షకులకు పాడి పంటలను ప్రసాదించే ధాన్యలక్ష్మిలా కనిపిస్తుంది. సాధకులకు మహామంత్రమాతృకయైన గాయత్రిలా గోచరిస్తుంది. సిద్ధులకు బీజాక్షర స్వరూపిణియైన శ్రీ బాలత్రిపుర సుందరిగా సాక్షాత్కరిస్తుంది.
నిరంతరం పూజారులు ఇచ్చే కర్పూర హారతుల వెలుగుల్లో వింత శోభలు వెదజల్లుతూ ‘యాద్భావం తద్భవతి’ అంటూ ఆశీర్వదిస్తుంది. కొండంత కోరికైనా ఆ తల్లికి చెప్పుకుంటే చాలు తీరుదుందనే నమ్మకంతో ఆ తల్లికి మోకరిల్లుతారు భక్తులు.
ఆ తల్లి కర కంకణాల రవళిలో భక్త రక్షణా దీక్షా కంకణత్వం వినిపిస్తుంది. మెరుస్తున్న ఆ కరకు త్రిశూలం ఎందరి పాపాత్ముల గుండెల్ని బ్రద్దలు చేసిందో..! ఆ తల్లి చేతిలోని విచ్చు కత్తి ఎందరి ఆర్తిని పొగొట్టిందో..! ఆ జగదీశ్వరి చేతిలోని శంఖధ్వని ఎందరి ఆపదలను తొలగించిందో..! మహిషాసురుడ్ని తొక్కి పట్టిన ఆ కుసుమ కోమల చరణాలు ఎందరి భవ బంధాలు త్రెంచాయో ..! ఎవరికి తెలుసు?
దివ్యాభరణాలతో, మెడలో మంగళ సూత్రంతో, సుదుటన మెరిసే కుంకుమరేఖతో, పెద్ద ముత్తైదువులా చిరునవ్వులు చిందిస్తున్న ఈ పరమేశ్వరీ ఎందరికి కాళ్లిచ్చిందో? ఎందరికి కళ్లిచ్చిందో? ఎందరికి చేతులనిచ్చిందో? మరెందరికి చేయూతనిచ్చిందో? ఎందరి కడుపు నింపిందో? ఎందరికి మాటలిచ్చిందో? ఎందరి మాట నిలబెట్టిందో? ఎందరికి తెలుసు?
వెల్లువలై పారే జగన్మాత కరుణారస ప్రవాహంలో మునిగి తేలిన ఆర్తులు, ఆర్థులు, జిజ్ఞాసులు, భక్తులు తమ మనసు నిండా ఆ తల్లి రూపాన్ని నింపుకుంటారు. ఆ తల్లి ముందు వర్ణవిచక్షణ లేదు. భాషా బేధం లేదు, అందరి మాటా వింటుందా తల్లి, మౌనంగానే జవాబిస్తుంది. ఎంతటి కోరికలైనా కోరండి, ఆ కోర్కెలు సమంజసమైతే , మనకు శ్రేయస్సు కలిగించేవే అయితే, తప్పక తీరుస్తుందాయమ్మ, సిగ్గూ, బిడియం వదిలిపెట్టి కొంగు చాచి అడగండి. మన కోర్కెలు తీర్చడానికే ఇక్కడ వెలసిందా దక్షిణ కాళీ.
‘అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ
సూరారులమ్మ గడుపారడి పుచ్చినయమ్మ తన్నులో
నమ్మిన వేల్పులటమ్మల మనమ్ముల నుండెడియమ్మ..! దుర్గ..! మాయమ్మ..!
కృపాబ్ధి యిచ్చుత మహత్వ పటుత్వ సంపదల్..!
ఉపాసకుల కోసమే పరబ్రహ్మ తత్వానికి ఒక రూపం ఏర్పాటు చేయబడింది. అని చెబతోంది శాస్త్రం. నిత్యసత్యమైన పరమాత్మ జ్ఞానం కలిగించేందుకు కొయ్య, రాయి మొదలగు వాటితో విగ్రహాలు చేసి పూజిస్తున్నాము. కోర్కెలు గలవారి భోగార్థమే సగుణోపాసన రూపకల్పన చేయబడింది. అయితే సాధకునికి మూర్తిపూజ నిషేదమని కొందరు అంటున్నా, మన పెద్దలు ఆ అభిప్రాయాన్ని నిష్కర్షగా త్రోసిపుచ్చారు. నిష్కాములు కూడా చిత్తశుద్ది కోసం సగుణోపాసన చెయ్యాలని, ఇది శాస్త్ర నిర్ణయమని నిశ్చయించారు.
‘సకామా సగుణో పాస్తిః నృణాం భోగాయ కల్పతే
నిష్కామా చిత్త శుద్ధర్ధే ఇది శాస్త్రస్య నిశ్చయః’
వైఖానసాగమ మౌళిక సిద్దాంతాన్ని అనుసరించి ఉపాసకుడు అర్చించే దేవతా విగ్రహం, దేవతాతత్వానికి ప్రతీక కాదు. విగ్రహం సాక్షాత్తు దైవమే, భక్తులు పూజించేది దేవత యొక్క ప్రతిమను కాదు, ఆ దేవత యొక్క అర్చావతారాన్ని, దైవం విగ్రహ రూపంలో అవతరించడమే అర్చావతారం.
ఆ మహేశ్వరిని శ్రీ చెంగాళమ్మ అర్చించే మనకు ఆ తల్లి రూపాన్ని చూడగానే, ఆమె లీలలు, ఆ లీలల ద్వారా ప్రకటితమైన ఆమె విశ్వాత్మ స్వరూపం మనస్సుకు వస్తుంది. దీని వలన మన భక్తిభావం బలహీనంగా వున్న ఆ తల్లి దివ్వమంగళ స్వరూపం మన భక్తి భావనకు బలం కలిగిస్తుంది. అందుకే ఆ తల్లి అర్చావతారంగా వెలసింది.
శ్రీ చెంగాళమ్మ భక్తుల దృష్టిలో ఈ వృక్షానికి చాలా ప్రాముఖ్యత వున్నది. హిందువులు వృక్షాన్ని పూజించడం పురాతనమైన ఆచారం. భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ "తాను వృక్షాలలో అశ్వత్థాన్ని" అన్నారు. ఇక చెంగాళమ్మ ఆలయం లోని వింత వృక్షాన్ని సాక్షాత్తూ శ్రీ చెంగాళమ్మ ప్రతిరూపంగా భావిస్తారు భక్తులు, సంతానాభిలాషులైన స్త్రీలు ఈ వృక్షానికి చీర చెంగు చింపి ఊయల కడితే, పిల్లలు పుడతారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆలయానికి వచ్చిన ప్రతిసారి భక్తితో ఈ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తారు.
1993 సం" లో శ్రీ చెంగాళమ్మ చెట్టు అగ్ని ప్రమాదానికి గురైంది. ఎవరో భక్తులు వెలిగించిన కర్పూరం వలన చెట్టు మొదట్లో వున్న ఎండుటాకులు అంటుకోవడంతో ఆ అగ్ని కాండంలోకి ప్రవేశించింది. తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో రగిలిన అగ్గి 8 గంటలకల్లా కాండం లోపల భాగాన్నంత కాల్చి వేసింది. మంట బయటకు రాకుండ లోలోపలే రగులుతూ ఈ వింత వృక్షానికున్న రంధ్రాలు నుండి ఆ మూలాగ్రం తీవ్రంగా పొగ చిమ్మడం భక్తులకు భయాందోళన కలిగించింది. ఈ విషయం తెలిసిన అగ్ని మాపక బృందంవారు హుటాహుటిన అక్కడకు చేరుకుని 6 గంటల తీవ్రమైన కృషితో చెట్టులొ లోపల రగులుతున్న అగ్నిని ఆర్పగలిగారు.
అప్పటికే చెట్టు కాండం లోపల భాగమంతా బొగ్గుగా మారిపొయింది. ఇన్నేళ్లుగా భక్తుల పూజలందుకున్న శ్రీ చెంగాళమ్మ చెట్టుకు ఇంత ప్రమాదం జరగడం వలన ఈ వృక్షం చనిపొతుందేమోనని, ఇక ఈ దేవతావృక్షం ఉండదేమొనని భక్తులంతా భావించి బాధపడ్డారు. కాని ఆ పరాశక్తి మహిమ ప్రకృతి సూత్రాలకు అతీతమైనది. కాలి బొగ్గుగా మారిన కాండం తిరిగి నెలకల్లా యధాప్రకారం పచ్చగా మారి పూర్వవైభవాన్ని సంతరించుకుంది అసంభవమైన కార్యాలను చేయగల్గిన శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి మహిమకు ఇదొక నిదర్శనం.
19-3-1999 లో ఈ చెట్టు కొమ్మల నుండి ధారాపాతంగా నీళ్లుకారాయి. ఈ సంఘటనను వేలది మంది భక్తులు కళ్లారా చూసారు. అప్పటికి అమ్మవారి తిరునాళ్లు జరిగి ఎంతో కాలం కావడంతో, శ్రీ చెంగాళమ్మ ఈ లీల చూపిందని తలచి అదే సం" లో ఎంతోవైభవంగా శ్రీ చెంగాళమ్మకు తిరునాళ్లు నిర్వహించారు.
అంతటి మహిమ కలిగిన ఈ దేవవృక్షానికి భక్తితో ప్రదక్షిణలు చేయడం శ్రీ చెంగాళమ్మ భక్తులందరికి శ్రేయస్కరం. ఎన్నో ఏళ్లక్రితం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవి కోవెలకు పెట్టాలనుకున్న ద్వారబంధము, తలుపులు విలీనమైపొయింది ఈ వృక్షంలోనే.
సకల సృష్టిని తన ఆధీనంలోకి ఉంచుకొని మహేశ్వరి అయ్యింది. తనను శరణు పొందిన వారందరికి కోర్కెలు తీర్చే కామధేనువు అయ్యింది. వరముల నొసగే చింతామణి అయ్యింది. ఆమె లీలా విలాసమే ఈ గ్రంధమంతా, అందుకే ఈ పుస్తకాన్న శ్రీ చెంగాళమ్మ చరితామృతమని చెప్పవొచ్చు.
ప్రతి మనిషి జీవితంలో వాని కున్నదానిపై అసంతృప్తి లేని దానికోసం తపన ఉంటుంది. కోరుకున్నవి ఎన్ని లభించినా, పరిస్థితులు మారుతున్నా కొద్ది కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. అవి తీరకపోతే మనసుకు సంతోషం కూడా మాయమౌతుంది. ఇదే నిజమైన దుఃఖం. ఈ దుఃఖం చక్రవర్తి నుండి సామాన్యుడి వరకు అందరినీ నిరంతరం కృంగదీస్తుంటుంది. అశాంతి నుండి తప్పించుకోవాలనే మనిషి, సంసారము, ధనము, అధికారం, సాధించుకోవాలనిపిస్తుంది.
ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకు కొన్ని అవసరాలు కష్టాలు తీర్చుకోవాలనుకోవడం తప్పదు. స్థిరమైన ఆత్మ విచారము, శరణాగతి కుదిరితే గాని , నిష్కమంగా మనం కర్మలు సాగించలేము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన శరణాగతి. ఏది అంత సులభంగా కుదరదు. మనం అనుకున్నవన్నీ నెరవేరిపుడు శ్రీ చంగళామ్మ మీద విశ్వాసం పెరుగతు, కొన్ని నెరవేరనపుడు విశ్వాసం తగ్గుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులందరితో కలసి దేవాలయానికి వెళ్లడం. సామూహిక పూజలు చేయడం. ఆ తల్లి లీలలను శ్రవణం చేయడం వంటివి ఎంతో శ్రేయస్కరం. నైమిశారణ్యంలోని మునులు, రుషులు కూడా ఇలాగే చేసేవారని మన పురాణాలు తెలియజేస్తుంది. అన్ని సాధనలకు భగవత్కధా శ్రవణమే మూలం కనుక వాల్మీకీ మహర్షి రామాయణం, వేదవ్యాసులు వారు అష్టాదశ పురాణాలు రచించి ప్రపంచమంతా తమ శిశ్య ప్రశిష్యుల ద్వారా అనేక రూపాలు గా గ్రామ గ్రామాలలో ప్రజలకు వినిపించేలా చేశారు. అందు వల్ల మన దేశంలో చదువురాని వారు కూడా రామాయణం గురించి, భారతం గురించి క్షుణ్ణంగా తెలుసుకోగలిగారు.
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ ఆలయంలో కొందరు గృహిణులు, పెళ్లికావలసిన యువతులు, ఆది, మంగళ, శుక్రవారాల్లో రాహు కాలంలో చిన్న దీపాలు వెలిగించి ఆ రాహుకాల సమయమంతా ఆ దీపం ముందు కూర్చొని దేవిని స్మరిస్తూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైన పూజ. సుమారు ఒకటిన్నర గంటకు పైగా ఆ తల్లి సన్నిధిలో కూర్చొని వెలుగుతున్న దీప శిఖను గమనిస్తూ ఆ పరమేశ్వరి లీలలను స్మరిస్తూ వుండటం వల్ల చక్కటి అనుభవాలు కలుగుతాయి.
ఆలయంలో అమ్మవారి సమక్షంలో కూర్చొని రంగవల్లుల మద్య రసం తీసిని నిమ్మకాయ చెక్కలనుతిరగేసి ప్రమిదల్లా చేసి నేతి దీపం వెలిగించడం ఈ దీప పూజ.
ఓం శ్రీ చెంగాళమాత పరమేశ్వరీ దేవ్యైనమః
1. ఓం కాళ్యైనమః
2. ఓం కాళికాయైనమః
3. ఓం కాళవత్యైనమః
4. ఓం మాత్ర నమః
5. ఓం త్రిపుర సుందర్యైనమః
6. ఓం సౌభాగ్యవత్యై నమః
7. ఓం భువనేశ్వర్యై నమః
8. ఓం శ్రీపదాయైనమః
9. ఓం శ్రీమహాలక్ష్మైనమః
10. ఓం త్రికళాయైనమః
11. ఓం ప్రకృత్యైనమః
12. ఓం విశ్వ జనన్యైనమః
13. ఓం వసుంధరాయైనమః
14. ఓం ధనధాన్యకర్యైనమః
15. ఓం శుభప్రదాయైనమః
16. ఓం వరలక్ష్మై నమః
17. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికయైనమః
18. ఓం కామధేనువేనమః
19. ఓం కదంబ కుసుమోత్సుకాయైనమః
20. ఓం అన్నపూర్ణాయైనమః
21. ఓం భవన్యైనమః
22. ఓం భోగప్రదాయైనమః
23. ఓం మందస్మితాయైనమః
24. ఓం పుర్ణాయైనమః
25. ఓం మహా భగవత్యైనమః
26. ఓం భక్తాభీష్ట ఫలప్రదాయిన్యైనమః
27. ఓం చంద్రకళాధరాయైనమః
28. ఓం వనమాల విభూషితాయైనమః
29. ఓం సామగాన ప్రియాయైనమః
30. ఓం మీనాక్ష్మైనమః
31. ఓం చక్రిణ్యైనమః
32. ఓం అమృతాయైనమః
33. ఓం శివాయైనమః
34. ఓం మహాకాళ్యైనమః
35. ఓం దీప్తాయైనమః
36. ఓం కృష్ణవర్ణైనమః
37. ఓం త్రిపురాయైనమః
38. ఓం మంత్ర స్వరూపిణ్యైనమః
39. ఓం త్రిలోచనాయైనమః
40. ఓం దుర్గాయైనమః
41. ఓం మహాగౌర్యైనమః
42. ఓం సర్వ కర్మఫలప్రదాయైనమః
43. ఓం శాకర్యైనమః
44. ఓం కృష్ణ పింగళాయైనమః
45. ఓం మహా విద్యాయైనమః
46. ఓం జగన్మాత్రేనమః
47. ఓం శివప్రియాయైనమః
48. ఓం భుభాయైనమః
49. ఓం సింహావాహనాయైనమః
50. ఓం కుంకుమ ప్రియాయైనమః
51. ఓం గంభీరాయైనమః
52. ఓం సర్వమంత్రమయైనమః
53. ఓం జోతస్నైనమః
54. ఓం విశ్వమాత్రేనమః
55. ఓం త్రిశక్యైనమః
56. ఓం శుభాయైనమః
57. ఓం ఆనందాయైనమః
58. ఓం యజ్ఞ విద్యాయైనమః
59. ఓం సునందాయైనమః
60. ఓం సుధాయైనమః
61. ఓం అష్టభుజాయైనమః
62. ఓం సుస్మితాయైనమః
63. ఓం సుముఖాయైనమః
64. ఓం వరదాయైనమః
65. ఓం సువృష్ర్యైనమః
66. ఓం సస్య వర్ధిన్యైనమః
67. ఓం అక్షరాయయైనమః
68. ఓం భవ్యాయైనమః
69. ఓం పాపవినాశిన్యైనమః
70. ఓం సౌధామిన్యైనమః
71. ఓం స్వయంభువే నమః
72. ఓం శృతి స్మృతి ధరాయైనమః
73. ఓం భక్త వత్సలాయైనమః
74. ఓం మాయాలాయైనమః
75. ఓం త్రిముర్యైనమః
76. ఓం శుభలక్షణాయైనమః
77. ఓం చిదానందాయైనమః
78. ఓం కైవల్య దాయిన్యైనమః
79. ఓం శుభలక్షణాయైనమః
80. ఓం శుభలక్షణాయైనమః
81. ఓం సరవ్మంగళ మంగళాయైనమః
82. ఓం పంచభూతాదివిక్రమాయైనమః
83. ఓం ఆది భూతాయైనమః
84. ఓం మహారూపాయైనమః
85. ఓం శ్రీ చక్రకోణ నివాసిన్యైనమః
86. ఓం కాళంగీ తటి వాసిన్యైనమః
87. ఓం ప్రత్యక్షాయై నమః
88. ఓం నిత్యాయై నమః
89. ఓం శ్రీ భవాన్యైనమః
90. ఓం ఇందిరాయైనమః
91. ఓం సత్యసనాయైనమః
92. ఓం దుర్లభ రూపిణ్యైనమః
93. ఓం సర్వాభిష్టఫల ప్రదాయిన్యైనమః
94. ఓం మహామాయాయైనమః
95. ఓం శాస్త్రమయాయైనమః
96. ఓం నిత్యానందాయైనమః
97. ఓం బ్రహ్మాండపోషిణ్యైనమః
98. ఓం సర్వతీర్థమయాయైనమః
99. ఓం సర్వవిద్యాధి దేవతాయైనమః
100. ఓం విజయాయైనమః
101. ఓం శుభ్రాయైనమః
102. ఓం కరుణాలయాయైనమః
103. ఓం సర్వసౌభాగ్య వర్థిన్యైనమః
104. ఓం సుర వందితాయైనమః
105. ఓం పరకళాయైనమః
106. ఓం షట్చక్ర వాసినైనమః
107. ఓం చెంగాళమాత్యైనమః
ఈ సమయంలో వేరే చింతలు మనస్సులో ప్రవేశించి ధ్యానం సరిగా కుదరడం లేదని కొందరు భక్తులు చెబుతుంటారు. అలాంటి వారు ఆ సమయంలో దేవీ భాగవతం, బగవద్గీత, శ్రీ చెంగాళమాత చరిత్ర మొదలగు సద్గ్రంధాలను పారాయణం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం, సద్గ్రంధ పారాయణ వలన మనసు అన్యచింతలు మాని అమ్మవారిపై లగ్నం అవుతుంది.
శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీ దేవస్థానం – సూళ్ళూరు పేట
శ్రీ చెంగాళమ్మ ఆలయానికి ఇప్పటి వరకు సేవందించిన కార్యనిర్వాహణాధికారులు
శ్రీ ఎ.ఎల్. నర్సిసింహయ్య 1960-1962
శ్రీ పి. సుబ్రమణ్యం 1962-1962
శ్రీ కె. వెంకట సుబ్బయ్య 1962-1963
శ్రీ ఎం. పెంచలయ్య 1963-1966
శ్రీ ఎ.ఎన్.ఆర్. మొదలియార్ 1966-1969
శ్రీ ఓ. సూర్యనారాయణరెడ్డి 1969-1969
శ్రీ వి.వెంకయ్య 1969-1970
శ్రీ కె.చెన్నయ్య 1970-1971
శ్రీ పి.సుబ్రమణ్యం 1971-1974
శ్రీ పి.సూర్యనారాయణ 1974 -1974
శ్రీ వి.హెచ్.ప్రసాద రావు 1974-1977
శ్రీ ఆర్. రాఘవరెడ్డి 1977-1980
శ్రీ ఆర్. ముత్యాలరావు 1980-1982
శ్రీ సి.హెచ్. పాండురంగారావు 1983-1983
శ్రీ వి.జయరాంరెడ్డి 1983-1988
శ్రీ పి.సూర్యనారాయణరెడ్డి 1988-1995
శ్రీ వి. వెంకటేశ్వర్లు 1995 – 2004
శ్రీ చెంగాళమ్మ ఆలయానికి ఇప్పటి వరకు సేవందించిన
ధర్మకర్తల మండలి అధ్యక్షులు
శ్రీ అర్వభూమి రామచంద్రారెడ్డి 1960
శ్రీ కాళంగి రాజగోపాలుశెట్టి 1964-1967
శ్రీ అయితా ఆనంద కృష్ణయ్య 1967-1970
శ్రీ కాళంగి రాజగోపాలుశెట్టి 1970-1973
శ్రీ పిట్ల వెంకట సుబ్బయ్య 1973-1977
శ్రీ కాళంగి ప్రభాకర్ 1977-1982
శ్రీ వేనాటి రామచంద్రారెడ్డి 1983-1986
శ్రీ వేనాటి మునిరెడ్డి 1989-1995
శ్రీ వేనాటి రామచంద్రారెడ్డి 1996-1998
2004 – నుండి
కొనసాగుతున్నారు
Goddess Chengalamma Parameswari manifested herself in the village of Sullurpeta on the Kolkata-Chennai highway and the temple for her was built on the bank of the Kanlangi river. History tells us that it was established during the fourth and fifth centuries. People also refer to her as the village goddess “Tenkali”. With the passage of time, she is being worshiped regularly by devotees as Chengalamma. Devotees turn up in large number to witness “Chengalamma Jatara” (fair)
The Village goddess who was called Tankali gained reputation as Sullurpeta Chengalamma Thalli and her idol in the temple faces the sea. Devotees from different parts of the State visit the place and fulfil their vows, referring the goddess as the mother who grants boons liberally. The naturally-formed image of the goddess adorning the hanging roots (vooda) of the banyan tree is really an awe-inspiring spectacle.